Current Affairs Telugu Daily

అంతర్రాష్ట్ర జల వివాదాలకులు ఒకే ట్రిబ్యునల్
*  దేశంలో రాష్ట్రాల మధ్య తలెత్తే నదీ జలాల వివాదాలను దశాబ్దాలపాటు కొనసాగనివ్వరాదని, నిర్ణీత కాలవ్యవధిలో వాటిని పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
*  ఇందుకు అనుగుణంగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కార బిల్లును తీసుకొచ్చింది. 
*  కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌  బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్న విభిన్న ట్రైబ్యునళ్ల స్థానంలో ఒకే శాశ్వత ట్రైబ్యునల్‌ ఏర్పాటును కేంద్రం ప్రతిపాదించింది.
*   వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు స్పష్టమైన నిబంధనలను బిల్లులో పొందుపరిచింది. వివాదం ట్రైబ్యునల్‌ వద్దకు వెళ్లిన తర్వాత గరిష్ఠంగా నాలుగున్నర ఏళ్ల లోపే పరిష్కరించాలని ప్రతిపాదిత బిల్లు నిర్దేశిస్తోంది.
*  ఒక్కసారి ట్రైబ్యునల్‌ తీర్పు వెలువరిస్తే అదే అంతిమం. వివాదంతో సంబంధం ఉన్న రాష్ట్రాలన్నీ తప్పనిసరిగా ఆ తీర్పును శిరసావహించాల్సిందే. 
* ఇప్పటిలా అధికారిక గెజిట్‌లో ప్రచురించాల్సిన అవసరం ఉండదు. ప్రతిపాదిత ట్రైబ్యునల్‌ మనుగడలోకి వచ్చిన నాటి నుంచి అప్పటి వరకూ పనిచేస్తున్న ట్రైబ్యునళ్లన్నీ రద్దవుతాయి.
*  ప్రస్తుతం వాటి ముందున్న కేసులన్నీ ఈ కొత్త ట్రైబ్యునల్‌కు బదిలీ అవుతాయి. జల వివాదంపై విచారణ జరపటానికి ట్రైబ్యునల్‌లో బెంచ్‌ ఏర్పాటవుతుంది. ఈ బెంచ్‌ కేంద్ర ప్రభుత్వానికి రెండేళ్లలోపు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
*  ఒక వేళ ఆ కాలపరిమితి లోపు నివేదిక ఇవ్వడం సాధ్యంకాకపోతే మరో ఏడాదిపాటు పొడిగించడానికి వీలు కల్పించారు. అప్పటికీ వీలుకాకపోతే మరో ఆరు నెలలు సమయం ఇస్తారు.
*  తుది తీర్పు వెలువడిన తర్వాత ఇంకా ఏమైనా అభ్యంతరాలు, లేదా కొత్త అంశాలను బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లటానికి ఏడాది సమయం ఉంటుంది. 
*  కొత్త ట్రైబ్యునల్‌లో ఒక ఛైర్మన్‌, ఒక వైస్‌ఛైర్మన్‌, ఆరుగురు సభ్యులు ఉంటారు. ఇందులో ముగ్గురు న్యాయ వ్యవస్థకు చెందిన వారు కాగా మరో ముగ్గురు జల వనరుల రంగ నిపుణులు.
*  ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ల గరిష్ఠ పదవీ కాలం అయిదేళ్లు. లేదా 70 ఏళ్ల వయస్సు వరకు. మిగతా సభ్యులు 67 ఏళ్ల వయస్సు తర్వాత కొనసాగడానికి వీల్లేదు.  
*  ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌, సభ్యులను ప్రధాన మంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి (లేదంటే వారు నియమించిన ప్రతినిధులు), కేంద్ర న్యాయశాఖ మంత్రి, జల వనరులశాఖ మంత్రి నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేస్తుంది. 
*  సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వారు మాత్రమే ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ పదవులు చేపట్టడానికి అర్హులు.
*  హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన వారిని మాత్రమే జ్యుడిషియల్‌ సభ్యులుగా నియమిస్తారు. కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో పనిచేసిన వారు, జాతీయ, అంతర్జాతీయ జల వివాదాల పరిష్కారంలో విశేష అనుభవం ఉన్న వ్యక్తులను మాత్రమే నైపుణ్య సభ్యులుగా తీసుకుంటారు. 
*  బిల్లును ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్‌, డీఎంకే, బీజేడీ పార్టీలు వ్యతిరేకించాయి. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండా ఈ బిల్లు ఎలా తీసుకొస్తారని ఆ పార్టీల నేతలు అధీర్‌రంజన్‌చౌధరి, టీఆర్‌ బాలు, భతృహరి మహతాబ్‌లు ప్రశ్నించారు. విపక్షాల వాదనలను జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తోసిపుచ్చారు.
*  ఈ బిల్లు ముసాయిదాను గతంలోనే రాష్ట్రాలకు పంపి అభిప్రాయాలు తీసుకున్నామని, పార్లమెంటు స్థాయీ సంసంఘం కూడా సమీక్షించిందని స్పష్టం చేశారు.

views: 687



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams