Current Affairs Telugu Daily

ఆదివాసీల అటవీ హక్కులపై 2019  కొత్త  ముసాయిదా
* దేశంలో అత్యంత వెనకబడిన వర్గాలకు చెందినవారు ఆదివాసులు. 2011 లెక్కల ప్రకారం 10.4 కోట్ల ఆదివాసుల్లో సుమారు 705 తెగలు ఉన్నాయి.
* జనాభాలో 8.6 శాతం గల వీరు దేశవ్యాప్తంగా 90 జిల్లాల్లో విస్తరించి ఉన్నారు. 
* మూడింట రెండొంతులు మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, మహారాష్ట్ర్ర, గుజరాత్‌, రాజస్థాన్‌ల్లో నివసిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వీరి సంఖ్య ఎక్కువ.
* ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్‌డీఏ సర్కారు ఆదివాసీ హక్కులను హరించే రీతిలో అటవీ బిల్లు- 2019 ముసాయిదాను రూపొందించింది. 
* ఇది వారి హక్కులను కబళించడమే కాకుండా, అటవీ అధికారులకు మరిన్ని అధికారాలను కట్టబెడుతోంది.
* కేంద్ర ప్రభుత్వం 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని తెరపైకి తెచ్చింది. 
* అప్పటివరకు 1927 నాటి బ్రిటిష్‌ చట్టమే అమలులో ఉండేది. ఈ రెండు చట్టాలు వారి హక్కులను హరిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.
* సర్కారు తాజాగా తెచ్చిన ముసాయిదా బిల్లు మరింత దారుణంగా ఉందని ఆదివాసీ సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. అడవిబిడ్డల హక్కులకు గండికొడుతూ, అటవీ అధికారులకు మరిన్ని అధికారాలను కట్టబెడుతోంది. అటవీ అధికారులకు శిక్షించే అధికారాలు కల్పించింది. వారికి తుపాకులు వినియోగించే అధికారాన్నీ కల్పించింది.
* ఈక్రమంలో తప్పు చేసిన అధికారులను దండించే విషయంలో కఠిన నిబంధనలు లేవు.
* గతంలో కొన్నిచోట్ల కొంతమంది సిబ్బంది ఆదివాసులపై దుర్మార్గంగా ప్రవర్తించడం తీవ్రవాదానికి పునాదులు వేసిన విషయాన్ని విస్మరించలేం.
* ఈ పరిస్థితుల్లో ముసాయిదా బిల్లుపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
* వాస్తవానికి 2006లో కేంద్రం తీసుకువచ్చిన చట్టంలోనే ఆదివాసులకు సంబంధించి కఠిన నిబంధనలు ఉన్నాయి.
* ఏళ్లతరబడి అడవుల్లో నివసిస్తున్న వారికి శాశ్వత నివాస హక్కులను ఆ చట్టం తిరస్కరించింది. 
* వంటచెరకు కోసం చిన్నచెట్టు కొమ్మ కొట్టినా తీవ్రంగా శిక్షించేవారు. అడవుల్లో యాజమాన్య హక్కులు లేకుండా కేవలం నివసించే హక్కును మాత్రమే కల్పించారు. 
* తరతరాల నుంచి అడవుల్లో నివసిస్తున్న వారి హక్కులను, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అడవుల్లో నివసిస్తున్న గిరిజనేతరుల హక్కులను గుర్తించే విధానం లోపభూయిష్ఠంగా మారింది.
* ముసాయిదా బిల్లు పార్లమెంట్‌ ఉభయ సభల ఆమోదం పొంది చట్టరూపం దాల్చితే ఆదివాసుల హక్కులకు భంగం వాటిల్లడం ఖాయమన్న వాదనను తేలిగ్గా తోసిపుచ్చలేం.
* బిల్లు ప్రకారం అధికారులకు అపరిమిత అధికారాలు దఖలు పడతాయి. గిరిజనుల నివాస, అటవీ ఉత్పత్తులు అమ్ముకునే హక్కులకు ఈ బిల్లు ముకుతాడు వేయనుంది. ఏ విషయంలో అయినా అధికారుల మాటే చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంది. గ్రామసభలు నిర్వీర్యమై గిరిజనుల బతుకులు అటవీ అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే దుస్థితి ఏర్పడనుంది.
* బిల్లు అడవి బిడ్డల హక్కులతో పాటు రాష్ట్రాలనూ దెబ్బతీయనుంది. అధికారాలన్నీ కేంద్రం చేతిలో కేంద్రీకృతం కానున్నాయి.
* అంతేకాక కేంద్రం కొత్తగా మరికొన్ని అధికారాలు తనకు తాను కల్పించుకుంది. అటవీ భూముల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉంది.
* అటవీ సంపదకు సంబంధించి రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను తిరగదోడే హక్కు కేంద్రానికి ఉంటుంది.
* అటవీ భూముల్లోని ఏ ప్రాంతం అయినా వాణిజ్య మొక్కల పెంపకానికి అనువుగా ఉందని భావిస్తే అక్కడ అటవీశాఖ, ప్రైవేట్‌ ఏజెన్సీలకు సదరు మొక్కలు పెంచే అధికారాన్ని కల్పిస్తుంది. అటవీ సంరక్షణ పేరుతో అధికారులకు ఆయుధాలను అందజేయనుంది. 
*నిందితులకు జామీనుకు సంబంధించి నిబంధనలు కఠినతరం చేశారు. తాము నిర్దోషులమని నిరూపించుకునే బాధ్యత గిరిజనులదేనని బిల్లు ప్రతిపాదిస్తోంది.
* అటవీ నేరాలను అరికట్టే ప్రక్రియలో భాగంగా అధికారులకు మరిన్ని కీలక అధికారాలు కల్పిస్తోంది. ఇవి దుర్వినియోగమవుతాయని, వీటిని అడ్డం పెట్టుకుని అధికారులు వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉందన్న వాదనను కొట్టిపారేయలేం.  గిరిజనులు నేరానికి పాల్పడితే, ఊరిలోని వారందరినీ బాధ్యులుగా చేసే అవకాశం ఉంది. అటవీ సంపదకు, ఉత్పత్తులకు నష్టం వాటిల్లినా, పశువులు అడవిలో గడ్డి మేసినా రాష్ట్ర ప్రభుత్వాలకు చర్యలు తీసుకునే అధికారాలను కల్పిస్తోంది. తమకున్న అధికారాలను ఉపయోగించి ఆ ప్రాంతంలో కొన్నాళ్లు గిరిజనుల హక్కులను అధికారులు రద్దుచేయవచ్చు. బిల్లు చట్టరూపం దాల్చితే అది ఆదివాసుల హక్కులకు భంగం కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
* ఐక్యరాజ్యసమితి 1994లో గిరిజనుల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసి ఆగస్టు తొమ్మిదో తేదీని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించింది.
* ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు, హక్కుల పరిరక్షణకు విద్య, వైద్యరంగాల్లో వారి అభివృద్ధికి కృషి చేయాలని సభ్యదేశాలను కోరింది. 
*అడవుల్లో నివసించడం ఆదివాసుల హక్కు. అటవీ భూములతో వారి అవినాభావ సంబంధాన్ని ఎవరూ విడదీయలేరు. ఏ చట్టమైనా అడవి బిడ్డల సంక్షేమాన్ని, అభ్యున్నతిని కాంక్షించాలే తప్ప వారి హక్కులకు భంగం కలిగించరాదు. ఈ పరిస్థితుల్లో బిల్లులోని నిబంధనలను సరళతరం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.
‘తెలంగాణ అటవీ చట్టం- 2019’ ముసాయిదాలో పేర్కొన్న పలు అంశాలు ఆదివాసీల జీవనోపాధిని దెబ్బతిసేవిగా ఉన్నాయి. కనుక రాజ్యాంగం ఐదవ షెడ్యూలు కింద పేర్కొన్న గిరిజన సలహా మండలి సిఫార్సుల కోసం ఈ ముసాయిదాను పంపించాలి.
* ఆదివాసీల అటవీ హక్కులు హరించే విధంగా ప్రస్తుత ‘అటవీ చట్టం -1967’ స్థానంలో ‘తెలంగాణ అటవీ చట్టం- 2019’ ముసాయిదాను కేసీఆర్ ప్రభుత్వం రూపొందించింది.
* చారిత్రకంగా అన్యాయానికి గురయిన ఆదివాసీల అటవీ హక్కుల గుర్తింపునకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వపు ‘అటవీ హక్కుల చట్టం- 2006’, అలాగే ‘షెడ్యూల్డు ప్రాంత పంచాయితీరాజ్‌ విస్తరణ (పెసా) చట్టం- 1996’కు ప్రభుత్వ ముసాయిదా పూర్తిగా విరుద్ధం. పోడు భూముల నుంచి ఆదివాసీలku కఠిన నియమాలతో ఈ ముసాయిదా ఉండటం గర్హనీయం.
* అటవీ హక్కులు సమగ్రంగా గుర్తించకుండానే అటవీ భూములలో ‘హరిత హారం’ పేరుతో మొక్కల పెంపకం చేపట్టడంతో తరచూ తెలంగాణలో ఆదివాసీలకు, అటవీ శాఖాధికార్లకు మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగానే అటవీ అధికారులకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ రూపొందించిన ముసాయిదా చట్టం ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది.
* కార్పొరేట్‌ రంగానికి, కలప ఆధారిత పరిశ్రమలకు కలప సమకూర్చేవిధంగా ‘ఉత్పాదక అడవుల’ పేరుతో కొత్త కేటగిరీని ముసాయిదా వర్గీకరించింది. 
*పారిశ్రామిక అవసరాలకోసం ముఖ్యంగా కలప, కలప గుజ్జు, వంట చెరకు కోసం అడవుల పెంపకం చేపట్టేందుకు ఈ ముసాయిదా వీలు కల్పిస్తుంది. 
*ప్రైవేటు భూములలో సైతం వ్యక్తులకు, సంస్థలకు కలప పెంచుకొనే అవకాశం కల్పించడంతో పాటు తదుపరి క్రమబద్ధీకరణ ఇత్యాది చర్యలు తీసుకునేందుకై అటవీ శాఖకు ఈ ముసాయిదా అధికారాలు కల్పించింది. 
* అలాగే వన్య ప్రాణి సంరక్షణ చట్టం- 1972 కింద అటవీ నేరాల నిరోధం, అటవీ నేరాల సంఘటనలపై చర్యలలో భాగంగా అటవీ అధికార్లకు ఆయుధాలను ఈ ముసాయిదా చట్టం సమకూర్చనుంది. వ్యక్తులను గాయపర్చే అధికారం కూడా అటవీ శాఖాధికార్లకు ముసాయిదా చట్టం ఇచ్చింది. అటవీ నేరానికి పాల్పడినట్లు అనుమానం వస్తే చాలు వ్యక్తులపై చర్యలు తీసుకోవచ్చు.
* చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన అటవీ శాఖాధికారులపై కేసుల నమోదు లేకుండా ముసాయిదా చట్టం వారికి రక్షణ కల్పిస్తుంది. 
* ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ముందుగా ఎక్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ విచారణ జరపాలి. విచారణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావిస్తేనే నేరాలకు పాల్పడిన అటవీ శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది.
* ముసాయిదాను శాసనంగా చేస్తే అటవీ శాఖ సిబ్బంది చట్టం ముసుగులో పెద్దఎత్తున ఆదివాసీలను అణచివేతకు గురిచేసే అవకాశం లేకపోలేదు. ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేసి పోడు భూముల నుండి బయటకు నెట్టే అవకాశం ముసాయిదా నియమాలు కల్పిస్తున్నాయి.
* ముసాయిదాలోని పలు అంశాలు గిరిజన ప్రాంతాల్లో శాంతికి విఘాతం కల్గించేవిగా ఉన్నాయి. వ్యక్తులకు వ్యతిరేకంగా అటవీ శాఖాధికారులు తీసుకున్న చర్యలు, వారు మంచి విశ్వాసంతోనే చేపట్టారని భావించాల్సి ఉంటుందని ముసాయిదా పేర్కొంది. అందువల్ల అటవీ సిబ్బంది అక్రమ చర్యల నుంచి కాపాడడానికి ప్రభుత్వ ముసాయిదా చట్టం ఒక రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది.
* అటవీ ఉత్పత్తులు సేకరించుకొని రవాణాచేసే వ్యక్తే ఆ ఉత్పత్తులు వారి సొంత భూముల నుంచి లేదా హక్కులు గుర్తింపు పొందిన ప్రాంతాల నుంచి సేకరించారని రుజువు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే అటవీ నేరానికి పాల్పడినట్లుగా కోర్టులో చార్జిషీట్‌ దాఖలుచేస్తే ఆ నేరం తాను చేయలేదని విచారణలో రుజువు చేయాల్సిన బాధ్యత నిందితునిపై ఉంటుంది. 
* వాస్తవానికి సాధారణ న్యాయ సూత్రాల ప్రకారం నిందితులపై మోపిన కేసు రుజువు కానంతవరకూ వారిని నేరస్థులుగా చూడడానికి వీలులేదు. క్రిమినల్‌ కేసుల్లో ప్రాసిక్యూషన్‌ ఏజెన్సీయే అనుమానాలకు తావివ్వకుండా నిందితులపై మోపబడిన ప్రతి నేరాన్ని రుజువు చేయవలసి ఉంటుంది. అయితే సాధారణ విచారణ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ముసాయిదా చట్టం రూపొందించబడింది. నిందితులపై దాఖలైన అటవీ నేరాల కేసులను ఉపసంహరించే అధికారం ప్రభుత్వానికి లేదని కూడా ముసాయిదా పేర్కొంది.
* సెక్షన్‌ 321 సి.ఆర్‌.పి.సి. కింద నిందితులపై దాఖలైన క్రిమినల్‌ కేసులను ఉపసంహరించమని ప్రభుత్వ సూచనల మేరకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులను కోరవచ్చు. అయితే అటువంటి అవకాశాలకు తావులేకుండా కఠినమైన నియమాలను ముసాయిదా చట్టం పేర్కొంది.
* ముసాయిదా నియమాల ప్రకారం అటవీ నేరానికి పాల్పడినట్లుగా అనుమానంతో కూడా అరెస్టు చేయవచ్చు. ఆస్తులను స్వాధీనం చేసుకొనే అధికారం అటవీ శాఖ సిబ్బందికి ఉంటుంది. నేరస్థుల లాకప్‌ గదులు, ఆయుధాలు, నిందితులు రవాణాకోసం మౌలిక సదుపాయాల కల్పనకు అటవీ శాఖ చర్యలు తీసుకోవచ్చు. కేసు దర్యాప్తులో నిందితులనుంచి నేరానికి సంబంధించి నమోదు చేసిన స్టేట్‌మెంట్ సెక్షన్‌ 25,26 సాక్ష్యాధారాల చట్టం- 1872 కింద చెల్లనేరదు. అయితే కేసుల్లో నిందితులనుంచి తీసుకొనే స్టేట్‌మెంట్ కూడా ముసాయిదా చట్టం సాక్ష్యంగా పరిగణించడం విశేషం. అందువల్ల అమాయక ఆదివాసీల నుంచి నేరం అంగీకరించినట్లుగా స్టేట్‌మెంట్‌లు తీసుకొని వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులకు పాల్పడే అవకాశం లేకపోలేదు.
*  ఏదైనా భూభాగాన్ని రిజర్వుడు అడవిగా ప్రకటించే క్రమంలో హక్కుల నిర్ధారణ విషయంలో ఆర్‌.డి.ఓ. స్థాయి అధికారి ప్రస్తుత తెలంగాణ అటవీ చట్టం -1967 కింద విచారణ చేపడుతున్నారు.
* రెవెన్యూ అధికారులే ఫారెస్టు సెటిల్మెంటు అధికారిగా వ్యవహరిస్తున్నారు. హక్కులు నిర్ధారణ అయిన తర్వాత ఆ భూములను రిజర్వుడు అడవులుగా ప్రకటిస్తారు. ఫారెస్టు సెటిల్మెంటు అధికారి ఇచ్చిన ఉత్తర్వులు విభేదించువారు జిల్లా కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.
*ప్రస్తుత నియమాలకు భిన్నంగా అటవీ శాఖాధికార్లనే ఫారెస్టు సెటిల్‌మెంటు అధికార్లుగా నియమించే అవకాశాన్ని ముసాయిదా చట్టం కల్పిస్తుంది. వారు ఇచ్చిన ఉత్తర్వులపై జిల్లా కోర్టుకు బదులు జిల్లా కలెక్టర్‌కు అప్పీలు చేసుకొనే విధంగా ముసాయిదా నియమాలు రూపొందించడం న్యాయస్థానాల జోక్యాన్ని నివారించడమే.
* హక్కుల నిర్ధారణలో లేవనెత్తే అభ్యంతరాల గడువు ప్రస్తుత అటవీ చట్టం- 1967 కింద 6 నెలలు ఉంటే, దానిని 3 నెలలకే ముసాయిదా చట్టం కుదించింది.
* రిజర్వు అడవులలో ప్రవేశాన్ని నిరోధిస్తూ రూపొందించిన ముసాయిదా నియమాలు అటవీ హక్కుల చట్టం కింద అటవీ వనరుల నిర్వహణకు కల్పించిన గ్రామసభల అధికారాలను కాలరాయడమే. రక్షిత అడవులలో, చెట్లు లేదా అటవీ ఉత్పత్తుల సేకరణ, వినియోగం, పశువులను మేపు స్థలాల వినియోగంపై ఆంక్షలు పెట్టే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే అటవీ భూమి సాగు నుంచి తొలగింపు చర్యలు కూడా అటవీ శాఖ చేపట్టే అవకాశాన్ని ముసాయిదా కల్పిస్తుంది. అటవీ భూముల, ఉత్పత్తుల వినియోగ విషయంలో ముసాయిదాలో పేర్కొన్న పలు ఆంక్షలు ప్రస్తుత అటవీ హక్కుల గుర్తింపు చట్టం -2006కి పూర్తిగా విరుద్ధం.
* షెడ్యూల్డు ప్రాంతాలలో ఆదివాసీల సొంత భూముల అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్‌ అనుమతితో ప్రస్తుత తెలంగాణ అటవీ చట్టం- 1967 కింద చెట్లను తొలగించుకోవచ్చు. అలాగే సొంత భూములలో చనిపోయిన చెట్లు, ఒరిగిన చెట్ల కలపను వ్యవసాయ పనిముట్ల కోసం ఆదివాసీలు వినియోగించుకోవచ్చు. ప్రస్తుత నియమాలను తొలగిస్తూ ముసాయిదా చట్టం రూపొందించడం ఆదివాసీ హక్కులను హరించడమేనని చెప్పక తప్పదు.
* ముసాయిదా చట్టంలో పేర్కొన్న పలు అంశాలు ఆదివాసీల జీవనోపాధిని దెబ్బతిసేవిగా ఉన్నందున రాజ్యాంగం ఐదవ షెడ్యూలు కింద పేర్కొన్న గిరిజన సలహా మండలి సిఫార్సుల కోసం ముసాయిదాను పంపించాలి. 
* ఆదివాసీల, ప్రజాస్వామిక సంఘాలతో చర్చించిన తర్వాతనే తెలంగాణ అటవీ చట్టం- 2019 ముసాయిదాను ప్రభుత్వం ఆమోదించాలి.
* ముసాయిదా చట్టాన్ని యథావిధిగా శాసనంగా తీసుకువచ్చినట్లయితే ఆదివాసీలను ఆందోళనకు గురిచేసి వారి అటవీ హక్కులను హరించినట్లవుతుంది.

views: 661Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams