Current Affairs Telugu Daily

వాన నీటి పరిరక్షణకు  స్థానిక సంస్థలకు కేంద్రం మార్గదర్శకాలు
* వర్షపు నీటిని ఒడిసి పట్టే ప్రక్రియపై సమర్థ పర్యవేక్షణ కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను కోరింది.
* తమ పరిధిలో కనీసం ఒక్క చెరువునైనా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని కూడా సూచించింది.
* ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. జులై 1న ప్రారంభమైన ‘జల్‌ శక్తి అభియాన్‌’ తొలి దశ కింద వీటిని విడుదల చేసింది.
* పట్టణ స్థానిక సంస్థ (యూఎల్‌బీ)లు వాన నీటి పరిరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఆ నగరంలో వాన నీటి పరిరక్షణను అవి సమర్థంగా పర్యవేక్షించాలి.
* మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసే విభాగాలు తమ పరిధిలోని ప్రాంతంలో భూగర్భ జలాల వెలికితీత, రీఛార్జి తీరును పర్యవేక్షించాలి. ప్రజల అవగాహన కోసం ఈ వివరాలను ప్రముఖ ప్రదేశాల్లో ప్రదర్శించాలి.
* భవిష్యత్‌లో భవన నిర్మాణ అనుమతులకు వాన నీటి పరిరక్షణ నిర్మాణాలు తప్పనిసరి చేయాలి. భవన నిర్మాణం పూర్తయ్యాక దాన్ని తనిఖీ చేయాలి.
* దేశంలో చెరువులు, కుంటలు వంటి నీటి వనరులను పునరుద్ధరిస్తే అక్కడ నీటి నిల్వతోపాటు పరిసరాల్లో భూగర్భ జలాల రీఛార్జికి వీలు కలుగుతుంది. ఆ ప్రాంతానికి అదనపు విలువను తెస్తుంది.
* జల్‌ శక్తి అభియాన్‌ కింద కనీసం ఒక నీటి వనరునైనా పునరుద్ధరించేందుకు ప్రతి నగరమూ చర్యలు చేపట్టాలి.
* రోడ్డు పక్కన పాదచారుల మార్గం, పార్కుల్లో నడిచే మార్గాలు వంటి చోట్ల కాంక్రీటు విస్తృతి పెరిగిపోవడం వల్ల నీరు భూమిలోకి సరిగా ఇంకడంలేదు. యూఎల్‌బీలు ఈ అంశంపై చర్యలు చేపట్టాలి.

views: 662



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams